రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్: మీ ఇంటి మీదే కరెంట్ ఉత్పత్తి చేయండి… వాడుకోగా మిగిలింది అమ్ముకోండి
ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకు పాతికేళ్ల వరకు పైసా కరెంటు బిల్లు కట్టనవసరం లేకుండా.. ఇంటికి రాయితీపై తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్తు వెలుగులు పంచే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
కేవలం సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడమే కాదు, మనం వాడుకోగా మిగిలిన కరెంటును ఎంచక్కా డిస్కంలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా కలిగించే పథకమే రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ (Rooftop Solar Programme).
ఈ పథకం ఏమిటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడం ఎలా? పథకం పొందడానికి ఉండాల్సిన నిబంధనలేమిటి? తదితర వివరాలన్నీ తెలుసుకుందాం.
గృహ వినియోగదారులను సౌర విద్యుత్తు వినియోగం వైపు ప్రోత్సహించి, మామూలు కరెంటు వినియోగాన్ని తగ్గించి వారికి విద్యుత్తు భారం నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్.
దీని ద్వారా ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు అమర్చి పగలంతా మీరు సౌర విద్యుత్తు ఉపయోగించుకుని రాత్రి పూట మాత్రం డిస్కంలు సరఫరా చేసే విద్యుత్తును ఉపయోగించుకునేలా చేయడమే ఈ పథకం ప్రత్యేకత.
2022-2023 నాటికి 40,000 మెగావాట్ల సౌర విద్యుత్తును సాధించ గలిగేలా దేశంలోని ఆవాసాలపైన సోలార్ ప్యానెళ్లను అమర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి ఏటా కూడా ఈ లక్ష్యాలను పెంచుకుంటూ పోతుంది.
తమ ఇంటిపైన సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవడానికి ముందుకు వచ్చే గృహ విద్యుత్తు వినియోగదారులను ఈ పథకం ద్వారా కేంద్రం ప్రోత్సహిస్తుంది.
ఇలాంటి వారికి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకయ్యే ఖర్చులో 40 శాతం వరకు రాయితీ కల్పిస్తుంది
ఎవరు అర్హులు?
ఇల్లు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పథకం పొందడానికి అర్హులు.
ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
మీ ఇంట్లో ప్రస్తుతమున్న ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా యథావిధిగా వాడుకునేలా రూపొందించిన పథకం ఇది. ఈ పథకం ప్రత్యేక కూడా ఇదే.
ఏసీలు, ఫ్రిజ్‌లు అన్నీ కూడా వాడుకోవచ్చా?
మీరు రోజూ మామూలు కరెంటును ఇంట్లో గృహావసరాలకు ఎలా వినియోగించుకుంటారో.. ఈ సోలార్ పవర్ కూడా అలాగే ఉపయోగించుకుంటారు.
మీటరు మార్చుతారా?
అవును. మీ ఇంటికి ఉన్న విద్యుత్తు మీటరు ఒక్కటి మాత్రమే మార్చుతారు. దాని స్థానంలో ఇన్పుట్, అవుట్పుట్ల సదుపాయం రెండూ ఉండే ఒక ప్రత్యేకమైన మీటర్‌ను మాత్ర అమర్చుతారు. మిగిలిన సెటప్ ఏదీ కూడా ఏమాత్రం మార్చరు. మార్చాల్సిన అవసరం లేదు.
ఆన్ గ్రిడ్/ ఆఫ్ గ్రిడ్ ఏది తీసుకోవాలి?
కేవలం ఆన్‌గ్రిడ్ కనెక్షన్ తీసుకుంటేనే ఈ పథకం వల్ల మీకు లబ్ధి చేకూర్చుతుంది.
ఆన్ గ్రిడ్ అంటే ఏమిటి?
క్లుప్తంగా చెప్పాలంటే సోలార్ పవర్, మామూలు కరెంటు రెండూ కూడా వినియోగించుకునే ప్రక్రియ అనొచ్చు. ఈ మీటర్‌కు రెండు ఇన్పుట్లు ఉంటాయి. మీ ఇంట్లో వైరింగ్ ఏమాత్రం మార్చకుండా కేవలం మీటర్‌ను మాత్రమే మార్చి గ్రిడ్‌కు కనెక్ట్ అవడం. ఒకటి సోలార్ విద్యుత్తు కోసం, రెండోది సాధారణ కరెంటు కోసం..
ఆన్‌గ్రిడ్ ఎలా పనిచేస్తుంది?
ఇంటిపైన అమర్చిన సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తయ్యే డైరెక్ట్ కరెంటు(DC)ను మీటర్‌లోని ఇన్వెర్టర్ ఆల్టర్నేటివ్ కరెంటు (AC)గా మార్చుతుంది.
సోలార్ పవర్, మామూలు కరెంటు రెండూ ఎలా వాడుకోగలం?
ఆన్ గ్రిడ్‌లో ఇది సాధ్యమవుతుంది. మీ ఇంటికి సోలార్ ప్యానెళ్లను అమర్చుతారు. దాని ద్వారా పగలంతా ఉత్పత్తయ్యే సోలార్ పవర్లో మీరు ఉపయోగించగా మిగిలిన కరెంటు మొత్తం మీ ప్రాంతంలోని డిస్కంలకు చెందిన గ్రిడ్‌కు వెళ్లిపోతుంది.
రాత్రిపూట మళ్లీ డిస్కంలు సరఫరా చేసే కరెంటును మీరు యథావిధిగా ఉపయోగించుకోవచ్చు.
దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
ఫలితంగా కరెంటు బిల్లు ఆరంభంలో గణనీయంగా తగ్గుతుంది. ఉదాహరణకు మీరు మీ ఇంటిపైన 5 కిలో వాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెళ్లను అమర్చుకున్నారని అనుకుందాం. అది రోజుకు 20 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తే మీరు కేవలం 8 యూనిట్లు వాడుకున్నారు.
అప్పుడు మిగిలిన 12 యూనిట్ల విద్యుత్తు గ్రిడ్‌కు వెళ్లిపోతుంది.
ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అయింది, ఎన్ని యూనిట్లు వాడుకుంది, ఎన్ని యూనిట్లు గ్రిడ్‌కు వెళ్లింది ఈ విద్యుత్తు మీటర్లో నమోదు అవుతుంది.
రాత్రిపూట మీట సోలార్ పవర్ ఉండదు కాబట్టి మీరు మామూలు విద్యుత్తు వాడుకుంటారు.
రాత్రంతా మీరు ఓ 2 యూనిట్లు వాడుకున్నారనుకోండి. అప్పుడు మీరు మొత్తం 10 యూనిట్ల సోలార్ విద్యుత్తును రోజంతా వినియోగించినట్లు.
మిగిలిన 10 యూనిట్లు గ్రిడ్‌కు వెళ్లిపోతుంది.
ఈ 10 యూనిట్ల ధరను మీ తదుపరి నెల కరెంటు బిల్లులో అడ్జెస్ట్ చేస్తారు. అలా మీరు తక్కువ వాడి ఎక్కువ యూనిట్లను గ్రిడ్‌కు పంపుతున్నట్లయితే మిగులు విద్యుత్తు యూనిట్లకు డిస్కంలే మీకు తిరిగి డబ్బు చెల్లిస్తాయి.
1కిలోవాట్ పవర్ (1kwp) రూఫ్‌టాప్ సోలార్ పవర్ జనరేట్ చేయడానికి ఎంత స్థలం అవసమవుతుంది?
ఇంటి డాబా మీద లేద మీ ఇంటి ప్రాంగణంలో 10 చదరపు మీటర్ల స్థలం అవసమవుతుంది. అయితే మీ ఇంటిపైన నీడ పడని చోట్ల మాత్రమే ఈ సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవాలి.
సహజంగా ఉత్తర దక్షిణ దిశలో ఈ ప్యానెళ్లను అమర్చుతుంటారు.
సంవత్సరమంతా విద్యుత్తు ఉత్పత్తి అవుతుందా?
లేదు. సౌర విద్యుత్తు ఉత్పత్తి అనేది ఆ రోజు కాచే ఎండను తీవ్రతను బట్టి, వాతావరణాన్ని బట్టి ఉంటుంది.
పగలు ఎండ లేకపోయినప్పుడు సౌర విద్యుత్తు ఉండదు కదా అప్పుడు ఎలా?
ఏమీ భయపడాల్సిన పని లేదు. సౌర విద్యుత్తు లేకపోతే డిస్కంలు ఇచ్చే సాధారణ కరెంటును మిగిలిన వాళ్లు లాగానే మీరు కూడా నిరంతరాయంగా వినియోగించుకోవచ్చు.
సబ్సిడీ ఎంత ఇస్తారు?
మీ ఇంటిపైన మీరు అమర్చుకునే సోలార్ ప్యానెళ్ల సామర్థ్యాన్ని బట్టి రాయితీ ఉంటుంది.
3kwp ఉత్పత్తి సామర్థ్యం గల ప్యానెళ్లు అమర్చుకుంటే 40 శాతం వరకు రాయితీ ఇస్తారు.
3kwp ఉత్పత్తి సామర్థ్యాన్ని మించిన ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే 20 శాతం వరకు రాయితీ ఇస్తారు.
500kwp ఉత్పత్తి సామర్థ్యం వరకు మాత్రమే ఈ రాయితీ పొందే సదుపాయం ఉంటుంది. దానికి మించిన ప్లాంటును మీ ఇంటికి ఏర్పాటు చేసుకుంటే రాయితీ సదుపాయం పొందలేరు.
ఉదాహరణకు…. శ్రీకాకుళంలో మీ ఇంటిపైన 3 కిలో వాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ.1.60లక్షలు ఖర్చు అవుతుందని అనుకుందాం. ఇందులో 40 శాతం అంటే దాదాపు రూ.60వేల వరకు సబ్సిడీ వస్తుంది.
ప్లాంటు పరిధి పెరిగేకొద్దీ ఖర్చు పెరుగుతుందా?
కాదు, సోలార్ పవర్ ప్లాంటు సామర్థ్యం పెరిగే కొద్దీ ఖర్చు తగ్గుతుంది. ఉదాహరణకు 10 కిలోవాట్ల సామర్థ్యమున్న ప్లాంటు ప్యానెళ్ల ఏర్పాటుకు రూ.3 నుంచీ రూ.4 లక్షల్ల వరకు ఖర్చు కావచ్చు. ఇది ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది.
సబ్సిడీ ఎప్పుడిస్తారు?
మీరు ఈ పథకానికి ఎంపిక కాగానే సబ్సిడీ ఇస్తారు. ప్యానెళ్ల కొనుగోలు, ఏర్పాటుకయ్యే ఖర్చులో సబ్సిడీ సొమ్ము పోను మిగిలింది మాత్రమే మీరు భరించాల్సి ఉంటుంది.
ప్యానెళ్లను నాకు నచ్చిన కంపెనీ నుంచీ కొనుక్కోవచ్చా?
వీలు కాదు. మీ పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (DISCOM) లు కొన్ని కంపెనీలు, వెండర్లను ముందే ఎంపిక చేసి ఉంటాయి. వారి నుంచీ మాత్రమే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ కంపెనీలే మీ ఇంటిపైన సోలార్ సిస్టమ్ అమర్చుతాయి. వారే దీని నిర్వహణ కూడా చూసుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏఏ జిల్లాల్లో ఈ పథకం వర్తిస్తుంది?
తెలంగాణ రాష్ట్రమంతటా కూడా ఈ పథకం అమలవుతోంది
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ – Andhra Pradesh Eastern Power Distribution Company Limited (APEPDCL) లోని జిల్లాల్లో మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, రాజమండ్రి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ పథకం అమలవుతుంది.
ఈ జిల్లాల్లో వారికి మాత్రే సబ్సిడీ ఇస్తారు.
ఇన్వర్టర్కు వారెంటీ ఉంటుందా?
ఆన్గ్రిడ్లో మనకు ఏర్పాటు చేసే ఇన్వర్టర్కు 5 నుంచి 8 సంవత్సరాల వారంటీ ఉంటుంది
ఆన్గ్రిడ్లో ఏసీలు, ఫ్రిజ్‌లో, వాటర్ హీటర్లు పనిచేస్తాయా?
అన్నీ పనిచేస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఆన్ గ్రిడ్‌లో సోలార్ ప్యానెళ్ల నిర్వహణ భారముంటుందా?
అసలు భారం ఉండదు. కాకుంటే 15 రోజులకు లేదా 20 రోజులకు ఒకసారి మీ డాబా మీద ఉన్న సోలార్ ప్యానెళ్లపైన ఉన్న దుమ్మును తడిచేయడం లేదా నీళ్లతో కడిగేయడం చేసుకుంటూ ఉండాలి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలో ఆయా ప్రాంతంలోని డిస్కంల వెబ్సైట్లో ఈ పథకానికి సంబంధించి ధరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ లింక్లుంటాయి.
వాటి ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీలో ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
National Portal for Rooftop Solar సంస్థ వెబ్సైటు https://solarrooftop.gov.in/ లో రిజిస్టరు చేసుకుని దానిద్వారా కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ డిస్కంల పరిధిలో ఎంపిక చేసిన కంపెనీలు, వెండర్లుంటారు. వారి ద్వారానే ఈ పథకాన్ని మనకు అమలు చేస్తారు. మనం ఈ పథకానికి ఎంపిక కాగానే ఈ ఎంపిక చేసిన కంపెనీల్లో ఎవరో ఒకరికి మన ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు అమర్చే బాధ్యతలు అప్పగిస్తారు.
మనకు ఇచ్చే సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం డిస్కంల ద్వారా ఈ కంపెనీలకు చెల్లిస్తుంది.
దాహరణకు 3 కేవీ ప్లాంటుకు 1.60లక్షలు ఖర్చు అవుతుందనుకోండి. మనం ఆ కంపెనీ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆ కంపెనీకి లక్ష చెల్లిస్తే వారు మన తరఫున మిగిలిన 60 వేల రూపాయల సబ్సిడీ తీసుకుని మనకు ప్లాంటు ఏర్పాటు చేస్తారు. ఆ ప్రక్రియ అంతా వారే చూసుకుంటారు..
సోలార్ ప్యానెళ్లకు వారెంటీ ఉంటుందా?
తప్పకుండా ఉంటుంది. డిస్కంలు ఎంపిక చేసిన సంస్థలు తాము ఏర్పాటు చేసే సోలార్ ప్యానెళ్లకు 25 సంవత్సరాలు వారెంటీ ఇస్తాయి. ఈ మధ్య కాలంలో అవి సరిగ్గా పనిచేయకపోతే పాతవాటి స్థానంలో కొత్తవి అమర్చుతారు.
మెయింటినెన్సు ఉంటుందా?
ఆన్గ్రిడ్లో మనకు ఎలాంటి మెయింటినెన్సు ఉండదు. .
ప్రతి 15 రోజులకు ఒక సారి సోలార్ ప్యానెల్స్ ప్లేట్లపైన పడిన దుమ్మును మాత్రం శుభ్రంగా తుడిచేసుకోవాలి. అంతే..
ఈ పథకం పొందడానికి ఎలాంటి పత్రాలు పొందుపరచాలి?
మీ పేరు మీద వచ్చే కరెంటు బిల్లు
మీటరు తప్పనిసరిగా డొమెస్టిక్ కనెక్షన్దే అయిండాలి
ఈ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్ కార్డు